🏠 prajamudra.com
Watermark
Clip Header Logo
Date of Publish : 21 October 2026, 4:07 pm Posted by : PRAJAMUDRA

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయాలు – జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఎస్పీ తుహిన్ సిన్హా

News Image
ముఖ్యమైన పాయింట్స్:పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం– జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ,ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి, అక్టోబర్ 21:* పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఆధ్వర్యంలో సంస్మరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమరుల స్మారక స్తూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించి, పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో శాంతిభద్రతల రక్షణ కోసం ముఖ పరిచయం లేని సాధారణ పౌరుల కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసే గొప్ప వృత్తి యూనిఫాం సర్వీస్. గడచిన రెండేళ్లలో అనకాపల్లి జిల్లా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ వేగంగా అభివృద్ధి చెందుతోంది. జిల్లాకు రూ.4 లక్షల కోట్ల మేర భారీ పెట్టుబడులు వస్తున్నాయంటే దానికి ప్రధాన కారణం మన పోలీసు విభాగం కల్పిస్తున్న పటిష్టమైన శాంతిభద్రతలు, రక్షణే. పెట్టుబడిదారులకు, ప్రజలకు భయం లేకుండా ముందుకు సాగేలా నిరంతరం శ్రమిస్తున్న పోలీసుల కృషి ఎంతో గొప్పది. జిల్లా యంత్రాంగం, పోలీసు విభాగం, విద్యావ్యవస్థ పరస్పర సమన్వయంతో పనిచేసినప్పుడే సమాజం మరింత ప్రగతిపథంలో పయనిస్తుంది. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాలకు సమాజం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది" అని పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ
"1959 అక్టోబర్ 21న చైనా సరిహద్దుల్లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద దేశ రక్షణ కోసం పోరాడి అసువులు బాసిన 10 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల స్మారకార్థం ప్రతి ఏటా ఈ దినాన్ని జరుపుకుంటున్నాం. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 154 మంది, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒకరు విధి నిర్వహణలో వీరమరణం పొందారు. నేడు లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం (నక్సలిజం), ఉగ్రవాదం వంటి సమస్యలు తగ్గుముఖం పట్టినప్పటికీ, సైబర్ నేరాలు, మహిళలపై జరిగే నేరాలు వంటి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటిని అణచివేసేందుకు పోలీసు సిబ్బంది మరింత ప్రొఫెషనలిజంతో పనిచేయాలి. చట్టపరిధిలో తమ విధులను నిర్భయంగా, నిస్వార్థంగా నిర్వహించినప్పుడే అమరుల త్యాగాలకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుంది. పోలీసు సిబ్బంది సమర్థవంతంగా పనిచేయడంలో వారి కుటుంబ సభ్యుల పాత్ర, మద్దతు ఎంతో కీలకమైనవి. అమరుల కుటుంబాల సంక్షేమానికి జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది" అని తెలిపారు.

​ఈ సందర్భంగా 1983 నుంచి ఉమ్మడి విశాఖపట్నం రూరల్ పరిధిలో వీరమరణం పొందిన 27 మంది అమరవీరుల వివరాలను, దేశవ్యాప్తంగా అమరులైన పోలీసుల పేర్లను అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన రావు చదివి వినిపించారు.

అనంతరం కలెక్టర్ మరియు ఎస్పీల చేతుల మీదుగా 14 మంది అమరవీరుల కుటుంబ సభ్యులకు రూ.10,000/- చొప్పున నగదు చెక్కులను, జ్ఞాపికలను అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

​ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన రావు, డీఎస్పీలు పి.శ్రీనివాస రావు, శ్రీ పి.వి.వి. నరసింహారావు, వి.బాబ్జీరావు, పరిపాలనాధికారి సిహెచ్.తిలక్ బాబు, ఇన్స్పెక్టర్లు బాల సూర్యారావు, ప్రేమ కుమార్, అశోక్ కుమార్, నాగేశ్వరరావు, రమేష్, రామకృష్ణారావు, మన్మధరావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, అమరుల కుటుంబ సభ్యులు మరియు కృష్ణదేవిపేట జడ్పీ హైస్కూల్ ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.
🏠 Home