🏠 prajamudra.com
Watermark
Clip Header Logo
Date of Publish : 30 October 2026, 3:17 pm Posted by : PRAJAMUDRA

​కార్మికులు, ప్రజలకు సీఐటీయూ జిల్లా నాయకత్వం పిలుపు

News Image
ముఖ్యమైన పాయింట్స్:కూటమి అభ్యర్థులను ఓడించండి.. సీపీఎం, వామపక్షాల అభ్యర్థులను గెలిపించండి​కార్మికులు, ప్రజలకు సీఐటీయూ జిల్లా నాయకత్వం పిలుపు​అభ్యర్థుల వివరాలతో కూడిన పోస్టర్ ఆవిష్కరణ
అనకాపల్లి:)ప్రజాముద్ర)ఈనెల 5వ తేదీన జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సీపీఎం, వామపక్షాల అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.వి. శ్రీనివాసరావు, రుత్తల శంకర్రావు కార్మికులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షుడు గంటా శ్రీరామ్, జిల్లా కమిటీ సభ్యులు కె.ఈశ్వరరావులతో కలిసి అభ్యర్థుల జాబితా, ఫొటోలతో కూడిన పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు.
​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కార్మికులు, శ్రామిక ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతున్న సీపీఎం, వామపక్షాల అభ్యర్థుల గెలుపు స్థానిక సంస్థల్లో ప్రజల గొంతుకను బలంగా వినిపించడానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం గత రెండున్నరేళ్లుగా కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరితే పట్టించుకోలేదని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఆప్కాస్ (APCOS) నుంచి తప్పించి తిరిగి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే చర్యలు చేపట్టారని ఆరోపించారు. రోజుకు 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచేలా కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయడానికి పూనుకున్నారని మండిపడ్డారు.
​ఈ నేపథ్యంలో ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న కూటమి అభ్యర్థులను ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో సీపీఎం తరఫున అనకాపల్లి, అచ్యుతాపురం, రాంబిల్లి, నక్కపల్లి, రోలుగుంట, గొలుగొండ మండలాల్లో జడ్పీటీసీ అభ్యర్థులుగా, మరో 12 స్థానాల్లో ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారని, పలుచోట్ల సీపీఐ అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. కార్మిక వర్గం, ప్రజాస్వామ్యవాదులు తమ అమూల్యమైన ఓట్లను వామపక్ష అభ్యర్థులకు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
🏠 Home