🏠 prajamudra.com
Watermark
Clip Header Logo
Date of Publish : 30 October 2026, 7:08 pm Posted by : PRAJAMUDRA

కూటమి విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: పీలా గోవింద సత్యనారాయణ

News Image
ముఖ్యమైన పాయింట్స్:కూటమి విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: పీలా గోవింద సత్యనారాయణ​సంక్షేమం, అభివృద్ధే ఎన్డీయే ప్రభుత్వ ధ్యేయం​స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి​107, 110 వార్డుల సమావేశాల్లో ఎమ్మెల్యే కొణతాల, మాజీ ఎమ్మెల్యే పీలా
అనకాపల్లి, ప్రజాముద్ర ప్రతినిధి:
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం అనకాపల్లి పరిధిలోని 107వ వార్డు సిరసపల్లి, 110వ వార్డు రోటరీ క్లబ్ వద్ద నిర్వహించిన అవగాహన సదస్సుల్లో స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణతో కలిసి ఆయన పాల్గొన్నారు.
​ఈ సందర్భంగా పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ‘సూపర్ సిక్స్’ పథకాలతో పాటు నిరుద్యోగుల చిరకాల స్వప్నమైన మెగా డీఎస్సీని పట్టాలెక్కించి చెప్పిన మాటను నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిరంతర అభివృద్ధి, సంస్కరణలు సమర్థవంతంగా సాగాలంటే రాజకీయ స్థిరత్వం అత్యంత కీలకమని, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ప్రజలు కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు.
​అభివృద్ధికి ఎన్డీయే.. విధ్వంసానికి వైసీపీ:
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం తీవ్ర విధ్వంసానికి గురైందని, కూటమి పాలనలో సుపరిపాలన, పారదర్శకతతో పునర్నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రం, స్థానిక సంస్థల కలయికతో ‘ట్రిపుల్ ఇంజిన్’ తరహా పాలన సాగితేనే పథకాల లబ్ధి ప్రతి అర్హుడికీ వేగంగా చేరుతుందని చెప్పారు. అలాగే ప్రజాసేవ పట్ల అంకితభావం కలిగిన విద్యావంతులు, యువతకు రాబోయే రోజుల్లో కూటమిలోని మూడు పార్టీలు పెద్దపీట వేస్తాయని తెలిపారు.
​ఇటీవల ముంచుకొచ్చిన ‘అర్నబ్’ తుఫాను ముప్పును ఎదుర్కోవడంలో ప్రభుత్వం చేపట్టిన ముందస్తు జాగ్రత్తలు, యంత్రాంగం సమన్వయంతో ప్రజలకు ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా రక్షించగలిగామని వివరించారు. కూటమి ప్రభుత్వ విజయాలను ప్రతి గడపకూ చేరవేస్తూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
🏠 Home