🏠 prajamudra.com
Watermark
Clip Header Logo
Date of Publish : 12 November 2026, 1:21 pm Posted by : PRAJAMUDRA

విశాఖలో ఘనంగా 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం

News Image
ముఖ్యమైన పాయింట్స్:58 దేశాల నుంచి ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధుల హాజరు – వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలే ప్రధాన అజెండా
విశాఖపట్నం: విశాఖ నగరంలో 31వ సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సు–2026 ఘనంగా ప్రారంభమైంది. ‘నేవిగేటింగ్ ద న్యూ వరల్డ్ ఆర్డర్’ (Navigating the New World Order) అనే ఇతివృత్తంతో భారత పరిశ్రమల సమాఖ్య ఈ సదస్సును నిర్వహిస్తోంది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంయుక్తంగా సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్ధన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునరావు, కియా ఇండియా ఎండీ, సీఈఓ గ్వాంగ్ లీ, సుచిత్రా ఎల్లా, సీఐఐ అధ్యక్షుడు, టాటా కెమికల్స్ సీఈఓ ఆర్. ముకుందన్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు.

ఈ అంతర్జాతీయ సదస్సుకు 58 దేశాలకు చెందిన ప్రభుత్వ, పారిశ్రామిక రంగ ప్రతినిధులతో పాటు భారత్‌లోని వివిధ దేశాల రాయబారులు తరలివచ్చారు. అంతర్జాతీయ పెట్టుబడులు, పారిశ్రామిక భాగస్వామ్యాలు, సాంకేతిక అభివృద్ధిపై ఈ సదస్సులో చర్చలు జరగనున్నాయి.

భారత్‌లో ఇండియా ఏఐ మిషన్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలతో ఉత్పాదకత, సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యత పెరుగుతోందని సీఐఐ అధ్యక్షుడు ఆర్. ముకుందన్ పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న ఆధునిక సాంకేతిక రంగాల్లో వివిధ దేశాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

సోలార్ ప్యానెళ్ల తయారీ, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వంటి రంగాల్లో భారత్ కీలక పాత్ర పోషించాలని సదస్సు వేదికగా పిలుపునిచ్చారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల విలువ ఆధారిత సరఫరా వ్యవస్థలను (అగ్రి వ్యాల్యూ చైన్స్) విస్తృతంగా అభివృద్ధి చేయడం ద్వారా ఆహార భద్రతను మరింత బలోపేతం చేయవచ్చని వెల్లడించారు.

పారిశ్రామిక పెట్టుబడులు, ఆధునిక సాంకేతికత, అంతర్జాతీయ భాగస్వామ్యాలు, వ్యవసాయ రంగ అభివృద్ధి సమన్వయంతోనే వికసిత్ భారత్–2047, వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలను సాధించగలమని సీఐఐ ప్రతినిధులు స్పష్టం చేశారు.
🏠 Home