🏠 prajamudra.com
Watermark
Clip Header Logo
Date of Publish : 14 November 2026, 10:28 pm Posted by : PRAJAMUDRA

మధుమేహంపై ముందస్తు చర్యలతో వ్యాధి నియంత్రణ సాధ్యం

News Image
ముఖ్యమైన పాయింట్స్:ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా అనకాపల్లిలో అవగాహన కార్యక్రమం – రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలని వైద్యుల సూచన
అనకాపల్లి, నవంబర్ 14: మధుమేహ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించి, వ్యాధిని ముందస్తుగా గుర్తించి నియంత్రించాలనే లక్ష్యంతో ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మధుమేహ వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్స, వ్యాధి కారణంగా తలెత్తే ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ ఏడాది ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని “మధుమేహంపై ముందస్తు చర్యలు (Early Action on Diabetes)” అనే నినాదంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మధుమేహాన్ని ప్రారంభ దశలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని వైద్యులు వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఆర్. అచ్యుతకుమారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలని సూచించారు. అధిక బరువును నియంత్రించుకోవడంతో పాటు సమతుల్య ఆహారం తీసుకోవాలని, ప్రతిరోజూ వ్యాయామం చేయాలని తెలిపారు. మధుమేహ లక్షణాలను ముందుగానే గుర్తించి వైద్యులను సంప్రదించాలని సూచించారు.

జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించడం, శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా గుండె, మూత్రపిండాలు, కంటి సంబంధిత సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్‌సీడీ విభాగం సిబ్బందికి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ సిబ్బందికి మధుమేహ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే మధుమేహంతో బాధపడుతున్న వారు వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా మందులు వాడాలని, రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని సూచించారు. వైద్యుల సలహాలను పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్, డిపిహెచ్‌ఎన్ డాక్టర్ కృష్ణసారావు, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఎస్. రాజి, డాక్టర్ వినోద్, డాక్టర్ వెంకటేష్, ఇతర అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

– ప్రజా ముద్ర NEWS, అనకాపల్లి

🏠 Home