🏠 prajamudra.com
Watermark
Clip Header Logo
Date of Publish : 20 November 2026, 1:11 pm Posted by : PRAJAMUDRA

ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

News Image
అనకాపల్లి: ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డిసెంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను తగరంపూడిలో ఆశా కార్యకర్తలు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా గత 12 ఏళ్లుగా ఆశా కార్యకర్తలు సేవలందిస్తున్నప్పటికీ, వారి వేతనాల పెంపుపై కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో ఉంచుకుని ఆశా కార్యకర్తలకు నెలకు కనీసం రూ.42 వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఆశా కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు, వారికి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు, పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలని కోరారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించనున్న ఢిల్లీ ధర్నాలో ఆశా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ కార్యదర్శి అన్నపూర్ణ, లక్ష్మి, సీఐటీయూ మండల కన్వీనర్ కాళ్ల పేలయ్యబాబు, నూక అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home