🏠 prajamudra.com
Watermark
Clip Header Logo
Date of Publish : 20 November 2026, 4:51 pm Posted by : PRAJAMUDRA

అనకాపల్లి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా మోటూరు నాగమణి,వైస్ చైర్‌పర్సన్‌గా పెంటకోట స్వాతి ఏకగ్రీవ ఎన్నిక

News Image
అనకాపల్లి, నవంబర్ 20: అనకాపల్లి జిల్లా పరిషత్ నూతన చైర్‌పర్సన్‌గా పరవాడ జడ్పీటీసీ సభ్యురాలు మోటూరు నాగమణి, వైస్ చైర్‌పర్సన్‌గా మునగపాక జడ్పీటీసీ సభ్యురాలు పెంటకోట స్వాతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ అధ్యక్షతన ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించారు.

ముందుగా జిల్లాలోని 24 మండలాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జడ్పీటీసీ సభ్యులతో కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్‌పర్సన్ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. మోటూరు నాగమణి పేరును నర్సీపట్నం జడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ ప్రతిపాదించగా, కశింకోట జడ్పీటీసీ సభ్యురాలు పొన్నగంటి నాగమణి బలపరిచారు. మిగిలిన సభ్యులంతా ఆమోదం తెలపడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అదేవిధంగా వైస్ చైర్‌పర్సన్ పదవికి పెంటకోట స్వాతి పేరును అనకాపల్లి జడ్పీటీసీ సభ్యుడు పల్లెల నాగేశ్వరరావు ప్రతిపాదించగా, బుచ్చయ్యపేట జడ్పీటీసీ సభ్యురాలు పోతుల భవాని బలపరిచారు. సభ్యులందరి ఆమోదంతో పెంటకోట స్వాతి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ, జిల్లాలోని 24 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికైన సభ్యులందరూ ప్రమాణ స్వీకారం, చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా ముగిశాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయకుమార్, కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, బత్తుల తాతయ్యబాబు పాల్గొన్నారు.

ఎన్నికల అనంతరం నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులను మంత్రి అనిత, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు శాలువాలతో సత్కరించి అభినందించారు.

కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణరావు, జిల్లా పరిషత్ సీఈఓ సత్యనారాయణ, డిప్యూటీ సీఈఓ రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజాముద్ర NEWS | అనకాపల్లి
🏠 Home