🏠 prajamudra.com
Watermark
Clip Header Logo
Date of Publish : 22 November 2026, 6:36 pm Posted by : PRAJAMUDRA

పొగ, ఆక్రమణల నుంచి విముక్తి కల్పించండి

News Image
చవితిన వీధి సమస్యలపై జిల్లా కలెక్టర్, జీవీఎంసీ అధికారులకు స్థానికుల ఫిర్యాదు

అనకాపల్లి, నవంబర్ 22: చవితిన వీధి ప్రధాన రహదారిపై పెరుగుతున్న అక్రమ ఆక్రమణలు, అనధికార వంట కేంద్రాల నుంచి వెలువడుతున్న పొగతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతాన్ని పొగ కాలుష్యం, రహదారి ఆక్రమణల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

జీవీఎంసీ అనకాపల్లి జోన్ పరిధిలోని 110వ వార్డు చవితిన వీధి ప్రధాన మార్గం సుమారు 40 అడుగుల వెడల్పు కలిగి ఉందని, అయితే రహదారిలో అధిక భాగాన్ని ఆక్రమిస్తూ అనేక అనధికార నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఫిర్యాదులో పేర్కొన్నారు. రోజురోజుకూ ఆక్రమణలు పెరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

ఇటీవల రహదారి ఆక్రమణల మధ్య అనధికార వంట కేంద్రాలు ఏర్పాటు చేశారని, వాటి నుంచి పగలు, రాత్రి పెద్దఎత్తున పొగ వెలువడుతూ సమీప నివాసాల్లోకి వ్యాపిస్తోందని తెలిపారు. దీంతో ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజల ఆరోగ్యాన్ని, రాకపోకలను దృష్టిలో ఉంచుకుని అనధికార వంట కేంద్రాల నుంచి వెలువడే పొగ సమస్యను పరిష్కరించాలని, రహదారిపై ఉన్న అక్రమ నిర్మాణాలు, వ్యాపార కేంద్రాలు, దుకాణాలను తొలగించి రహదారిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.
🏠 Home