🏠 prajamudra.com
Watermark
Clip Header Logo
Date of Publish : 22 November 2026, 8:29 pm Posted by : PRAJAMUDRA

ఇంటి తాళం తెరిచి బంగారం, నగదు చోరీ.. ముగ్గురు నిందితుల అరెస్ట్

News Image
ముఖ్యమైన పాయింట్స్:21.70 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2,500 నగదు స్వాధీనం
విశాఖపట్నం, ప్రజాముద్ర ప్రతినిధి:
ఇంటి తాళం తెరిచి బంగారు ఆభరణాలు, నగదు అపహరించిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టును గాజువాక క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి 21.70 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు రూ.2,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం సిటీ క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ వెంకటరావు ఆధ్వర్యంలో సౌత్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు.
​అసలేం జరిగిందంటే..
ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో గాజువాక శ్రీనగర్ ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఓ ఇంటిని తిరుపతికి చెందిన చందక మణికంఠ @ శ్రీకాంత్ (29), బదురు వాసు (32) లక్ష్యంగా చేసుకున్నారు. వాసు ఇంటి బయట కాపలా కాయగా, మణికంఠ ఇంటి ముందున్న కరెంట్ మీటర్‌పై ఉంచిన తాళం చెవులతో లోపలికి ప్రవేశించాడు. ఇనుప రాడ్డుతో బీరువాను పగులగొట్టి అందులోని బంగారు, వెండి వస్తువులు, నగదును దోచుకెళ్లాడు.
​తాకట్టు పెట్టి జల్సాలు:
దొంగిలించిన బంగారంలో ఒక చైన్‌ను తమిళనాడు రాష్ట్రం గుమ్మిడిపూండికి చెందిన మునికృష్ణ B.R. (40) సహాయంతో బజాజ్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి రూ.1,52,069 రుణం తీసుకున్నారు. ఆ సొమ్మును ముగ్గురూ పంచుకొని సొంత అవసరాలకు వాడుకున్నారు.
​పోలీసులకు చిక్కారిలా:
ఆదివారం (నవంబర్ 22) గాజువాక బీసీ రోడ్డులోని బంగారు దుకాణాల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఈ ముగ్గురిని గాజువాక క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుల నుండి 16.97 గ్రాముల బంగారు మిరియాల తాడు, 2.84 గ్రాముల చెవి దిద్దులు, 1.89 గ్రాముల మూడు బంగారు కాసులతో పాటు రూ.2,500 నగదును రికవరీ చేశారు.
​పోలీసుల హెచ్చరిక:
ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లేటప్పుడు తాళం చెవులను మీటర్ల పైనో, చెప్పుల స్టాండ్ కిందో దాచిపెట్టవద్దని గాజువాక క్రైమ్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
🏠 Home