రైతులకు పంటల బీమాపై భరోసా.. రబీ 2026-27 బీమా పోర్టల్ ప్రారంభం
పంట నష్టాలకు ఆర్థిక రక్షణ కల్పించడమే లక్ష్యం – కలెక్టర్ విజయ కృష్ణన్
అనకాపల్లి, నవంబర్ 24: ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ముఖ్య ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. రబీ 2024-25, ఖరీఫ్ 2025 పంటల బీమాకు సంబంధించి అర్హులైన రైతుల జాబితాను జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆమోదించారు. అలాగే రబీ 2026-27 సీజన్‌కు సంబంధించిన పంటల బీమా పోర్టల్‌ను కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుఫానులు, కరువు, అకాల వర్షాలు తదితర ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దిగుబడులు కోల్పోయిన రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేస్తున్నాయని తెలిపారు.
క్లస్టర్-7 పరిధిలోని అనకాపల్లి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, కర్నూలు జిల్లాల్లో టాటా ఏఐజీ బీమా సంస్థ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎంపిక చేసిన పంటలను సాగు చేస్తున్న రైతులతో పాటు కౌలు రైతులు కూడా ఈ పథకంలో చేరేందుకు అర్హులని పేర్కొన్నారు.
రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం
ఎంపిక చేసిన వ్యవసాయ పంటలైన వరి, మినుము, పెసలకు బీమా చేసిన మొత్తంలో 1.5 శాతం ప్రీమియం చెల్లించాలి. వాణిజ్య, ఉద్యాన పంటలైన మామిడి, జీడిమామిడికి బీమా చేసిన మొత్తంలో 5 శాతం ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన ప్రీమియం మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి.
బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందిన రైతులకు సంబంధిత బ్యాంకులే ప్రీమియం వసూలు చేసి బీమా సంస్థకు చెల్లిస్తాయి. బీమా పథకంలో కొనసాగడం ఇష్టం లేని రైతులు గడువు తేదీకి కనీసం ఏడు రోజుల ముందుగా సంబంధిత బ్యాంకుకు లిఖితపూర్వకంగా తెలియజేయాలి.
దరఖాస్తుకు అవసరమైన పత్రాలు
పంట రుణం పొందని రైతులు ఆధార్ కార్డు, భూమి పట్టాదారు పాస్ పుస్తకం లేదా కౌలు కార్డు, పంట సాగు చేసినట్లు స్వీయ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చు.
సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్లు, గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS), పోస్టాఫీసుల ద్వారా లేదా నేరుగా NCIP పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా ప్రీమియం చెల్లించి నమోదు చేసుకునే అవకాశం ఉంది.
రైతులు బీమా చేసిన పంట వివరాలు ఈ-క్రాప్‌లో సరిగ్గా నమోదయ్యాయో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని కలెక్టర్ సూచించారు. చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా గడువు తేదీకి ముందే నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని, దళారులు, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు.
పంటల వారీగా బీమా నమోదు గడువులు
- వరి పంట – 31 డిసెంబర్ 2026
- మినుము, పెసలు – 15 డిసెంబర్ 2026
- మామిడి – 31 డిసెంబర్ 2026
- జీడిమామిడి – 15 నవంబర్ 2026
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా ఉద్యానశాఖ అధికారి, ఎల్డీఎం, టాటా ఏఐజీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.