🏠 prajamudra.com
Watermark
Clip Header Logo
Date of Publish : 25 November 2026, 12:20 pm Posted by : PRAJAMUDRA

విద్యుత్ బిల్లుల పేరుతో వచ్చే నకిలీ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

News Image
ఫేక్ ఎస్ఎంఎస్‌లు, వాట్సాప్ సందేశాల్లోని లింకులను క్లిక్ చేయవద్దు
వినియోగదారులకు ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ జి. ప్రసాద్ సూచన
అనకాపల్లి, నవంబర్ 25: విద్యుత్ బిల్లుల చెల్లింపుల పేరుతో సైబర్ నేరగాళ్లు పంపిస్తున్న నకిలీ ఎస్ఎంఎస్‌లు, వాట్సాప్ సందేశాల పట్ల విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీఈపీడీసీఎల్ అనకాపల్లి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ జి. ప్రసాద్ సూచించారు.
విద్యుత్ బిల్లు బకాయి ఉందని, వెంటనే బిల్లు చెల్లించకపోతే అదే రోజు రాత్రి 8 గంటల తర్వాత విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని, విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని హెచ్చరిస్తూ గుర్తుతెలియని మొబైల్ నంబర్ల నుంచి కొంతమంది వినియోగదారులకు నకిలీ సందేశాలు వస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ బిల్లు చెల్లింపులు అప్‌డేట్ చేయాలని, సందేశంలో ఇచ్చిన మొబైల్ నంబర్‌కు ఫోన్ చేయాలని లేదా లింక్ ద్వారా చెల్లింపులు చేయాలని సూచించే ఇటువంటి సందేశాలను నమ్మవద్దని స్పష్టం చేశారు.
సైబర్ నేరగాళ్లు పంపించే నకిలీ ఎస్ఎంఎస్‌లు, వాట్సాప్ సందేశాల్లోని లింకులను క్లిక్ చేయడం వల్ల వ్యక్తిగత, బ్యాంకు వివరాలు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందువల్ల వినియోగదారులు గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయరాదని, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించరాదని సూచించారు. అనుమానాస్పద సందేశాల్లో పేర్కొన్న ఫోన్ నంబర్లకు స్పందించకుండా, విద్యుత్ బిల్లులు, చెల్లింపులకు సంబంధించిన వివరాలను అధికారిక మార్గాల ద్వారానే నిర్ధారించుకోవాలని కోరారు.
విద్యుత్ బిల్లు చెల్లింపులు, విద్యుత్ సరఫరా, ఇతర సేవలకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా ఫిర్యాదులు ఉంటే ఏపీఈపీడీసీఎల్ టోల్ ఫ్రీ నంబర్ 1912కు లేదా వాట్సాప్ నంబర్ 9493681912 చాట్ ద్వారా సంప్రదించాలని ఎస్ఈ సూచించారు.
విద్యుత్ వినియోగదారులు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉంటూ, ఇటువంటి నకిలీ సందేశాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు
🏠 Home