జాతీయ జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలి యూజీసీ ఈక్వాలిటీ నిబంధనలు తక్షణమే అమలు చేయాలి బీసీ చైతన్య వేదిక విద్యార్థి విభాగం తెలంగాణ అధ్యక్షుడు నగేష్ సూర్యవంశం డిమాండ్ హైదరాబాద్: భారత ఓబీసీ ఉద్యమ పితామహుడు, బహుజన హక్కుల పోరాట యోధుడు మాన్యవర్ త్యాగమూర్తి ఆర్.ఎల్. చందాపురి సాహెబ్ 103వ జయంతి వేడుకలు ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. బీసీ చైతన్య వేదిక విద్యార్థి విభాగం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నగేష్ సూర్యవంశం ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఎదుట జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బీసీ సంఘాల నాయకులు, విద్యార్థి నాయకులు పాల్గొని...
ముఖ్యమైన పాయింట్స్:
- జాతీయ జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలి
- యూజీసీ ఈక్వాలిటీ నిబంధనలు తక్షణమే అమలు చేయాలి
- బీసీ చైతన్య వేదిక విద్యార్థి విభాగం తెలంగాణ అధ్యక్షుడు నగేష్ సూర్యవంశం డిమాండ్
హైదరాబాద్: భారత ఓబీసీ ఉద్యమ పితామహుడు, బహుజన హక్కుల పోరాట యోధుడు మాన్యవర్ త్యాగమూర్తి ఆర్.ఎల్. చందాపురి సాహెబ్ 103వ జయంతి వేడుకలు ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. బీసీ చైతన్య వేదిక విద్యార్థి విభాగం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నగేష్ సూర్యవంశం ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఎదుట జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బీసీ సంఘాల నాయకులు, విద్యార్థి నాయకులు పాల్గొని చందాపురి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వంగ అరుణ్ కుమార్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అన్నం వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశంలో వెనుకబడిన తరగతుల హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఆర్.ఎల్. చందాపురి తన జీవితాన్ని ఉద్యమానికి అంకితం చేశారని కొనియాడారు. 1947 సెప్టెంబర్ 10న ఆయన నాయకత్వంలో బీహార్ ప్రాంతీయ పిచ్ఛడీ జాతి సంఘ్ స్థాపించబడిందని, అనంతరం అది అఖిల భారత పిచ్ఛడా వర్గ్ సంఘ్‌గా విస్తరించి దేశవ్యాప్తంగా వెనుకబడిన తరగతుల ఐక్యతకు వేదికగా నిలిచిందని గుర్తుచేశారు.
1948 మార్చి 18న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్‌ను కలిసి రాజ్యాంగంలో ఆర్టికల్ 340 చేర్చాలని విజ్ఞప్తి చేసిన చారిత్రక కృషిని నాయకులు ప్రస్తావించారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగబద్ధమైన చర్యలు తీసుకునే దిశగా ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.
చందాపురికి జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించాలి
మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, బి.పి. మండల్ వంటి సామాజిక న్యాయ ఉద్యమకారుల సరసన ఆర్.ఎల్. చందాపురికి కూడా జాతీయ స్థాయిలో సముచిత గుర్తింపు కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఆయన పోరాటాలు, సంస్థాగత నిర్మాణం, బహుజన సమాజానికి అందించిన చైతన్యాన్ని భావితరాలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఉండాలి
రాబోయే జాతీయ జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేసి కులాల వారీగా జనాభా వివరాలను నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకోసం జనగణనలో డ్రాప్‌డౌన్ మెనూ విధానాన్ని ప్రవేశపెట్టి, రాష్ట్రాల వారీగా గుర్తింపు పొందిన కులాల జాబితాను అందుబాటులో ఉంచాలని సూచించారు.
ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ కేటాయించి జనాభా వివరాలను పారదర్శకంగా నమోదు చేయాలని, జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఓబీసీ కులగణన సామాజిక న్యాయం సాధనకు కీలకమని పేర్కొన్నారు.
యూజీసీ ఈక్వాలిటీ నిబంధనలు అమలు చేయాలి
దేశంలోని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్షకు తావులేకుండా యూజీసీ ఈక్వాలిటీ నిబంధనలను తక్షణమే అమలు చేయాలని నాయకులు కోరారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులకు సమాన అవకాశాలు, విద్యా భద్రత కల్పించాలని, వివక్షకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి సమర్థవంతమైన వ్యవస్థలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
బహుజన విద్యార్థులు ఐక్యంగా ముందుకు రావాలి
ఫూలే, సావిత్రిబాయి ఫూలే, ఛత్రపతి సాహు మహారాజ్, పెరియార్, అంబేడ్కర్, బి.పి. మండల్, ఆర్.ఎల్. చందాపురి ఆశయాలను యువత కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు ఐక్యంగా నిలిచి విద్య, ఉద్యోగాలు, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం సంఘటితంగా కృషి చేయాలని కోరారు.
చందాపురి జీవితం కేవలం ఒక వ్యక్తి చరిత్ర మాత్రమే కాదని, అది భారత ఓబీసీ ఉద్యమ చరిత్ర అని నాయకులు పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీసీ చైతన్య వేదిక మహిళా కార్యదర్శి రేణుకా దీదీ, బహుజన రాజ్యం పార్టీ జాతీయ అధ్యక్షుడు రమావత్ లాలూ నాయక్, హైకోర్టు న్యాయవాది బాలాజీ నాయక్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు ప్రశాంత్ గౌడ్, అంజన్, శరత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
– ప్రజా ముద్ర NEWS