Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

ఫేజ్‌-1 పంచాయతీ ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు

Author
Posted By PRAJAMUDRA
| 23 Nov 2026, 10:40 PM | ఆంధ్రప్రదేశ్
ఫేజ్‌-1 పంచాయతీ ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు

  • శాంతియుతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి: ఎస్పీ తుహిన్ సిన్హా

అనకాపల్లి, నవంబర్ 23: జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి డీఎస్పీలు, సీఐలు, ఎస్‌హెచ్‌ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల ముందస్తు భద్రతా చర్యలపై సమీక్షించారు.

జిల్లాలో ఫేజ్‌-1 ఎన్నికలు జరగనున్న ఎనిమిది మండలాల్లోని 353 పోలింగ్ లొకేషన్లను సమస్యాత్మకత ఆధారంగా గుర్తించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. వీటిలో 71 అతి సమస్యాత్మక, 108 సమస్యాత్మక, 174 సాధారణ పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు.

అతి సమస్యాత్మక కేంద్రాల్లో అవసరాన్ని బట్టి 1+4, 1+2 పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయాలని, సమస్యాత్మక కేంద్రాల్లో 1+1, సాధారణ కేంద్రాల్లో ఒక పోలీసు సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా 95 రూట్ మొబైల్ బృందాలను నిరంతరం అందుబాటులో ఉంచాలని, ప్రతి మండలానికి కనీసం మూడు స్ట్రైకింగ్ ఫోర్సులతో పాటు ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌ను సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అదనపు ఎస్పీ, ఎస్పీ ఆధ్వర్యంలో రిజర్వ్ బలగాలను కూడా సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.

వాహనాల్లో ప్రత్యేక పరికరాలు తప్పనిసరి
ప్రతి రూట్ మొబైల్, స్ట్రైకింగ్ ఫోర్స్ వాహనంలో మైక్, లౌడ్ స్పీకర్‌తో కూడిన పీఏ సిస్టమ్, సైరన్, తగినన్ని లాఠీలు తప్పనిసరిగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు. అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో బాడీ ఓర్న్ కెమెరాలను వినియోగించాలని సూచించారు. ఈ ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
ప్రహరీ గోడలు లేని పోలింగ్ కేంద్రాల వద్ద ఎంపీడీఓలు, ఎంఆర్ఓలతో సమన్వయం చేసుకుని ఎన్నికలకు ముందే తాత్కాలిక ఫెన్సింగ్ లేదా బారికేడింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. సిగ్నల్ సమస్యలు ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి, పోలింగ్ రోజున ప్రతి గంట లేదా రెండు గంటలకు సమాచారం అందేలా ప్రత్యామ్నాయ కమ్యూనికేషన్ వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని తెలిపారు.

సమస్యాత్మక వ్యక్తులపై ప్రత్యేక నిఘా
రౌడీషీటర్లు, బైండోవర్ అయిన వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం వారు పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల 100 నుంచి 200 మీటర్ల పరిధిలో ప్రజలు గుంపులుగా చేరకుండా, ఓటు వేసిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయేలా పీఏ సిస్టమ్ ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు.

కౌంటింగ్ సమయంలోనూ అప్రమత్తత
పోలింగ్ జరిగిన రోజే ఓట్ల లెక్కింపు కూడా నిర్వహించనున్న నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. కేంద్రాల వెలుపల అనవసరంగా గుంపులు చేరకుండా పోలీసు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

మద్యం విక్రయాలపై కఠిన చర్యలు
ఎన్నికలకు 48 గంటల ముందు నుంచే మద్యం దుకాణాలను పూర్తిగా మూసివేయించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడా బెల్ట్ షాపులు నిర్వహించడానికి వీల్లేదని, అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ తుహిన్ సిన్హా సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సంబంధిత సబ్‌డివిజన్ డీఎస్పీలు, సీఐలు, ఎస్‌హెచ్‌ఓలు, ఎలక్షన్ సెల్ అధికారులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: