Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

పెండింగ్ కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

Author
Posted By PRAJAMUDRA
| 24 Nov 2026, 02:14 PM | ఆంధ్రప్రదేశ్
పెండింగ్ కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

అనకాపల్లి, నవంబర్ 24: ఏళ్ల తరబడి న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న రాజీపడదగ్గ కేసులను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు డిసెంబర్ 12, 2026న జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ లోక్ అదాలత్ ద్వారా ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ వివాదాలు, భూవివాదాలు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకింగ్, మనీ రికవరీ కేసులు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే మోటార్ ప్రమాదాల నష్టపరిహార కేసులు, పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు, కుటుంబ వివాదాలు, మెయింటెనెన్స్ పిటిషన్లు, కార్మిక మరియు పారిశ్రామిక వివాదాలను కూడా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు.
లోక్ అదాలత్ ద్వారా సమయం, ధనం ఆదా కావడంతో పాటు సుదీర్ఘ న్యాయ ప్రక్రియ నుంచి ఉపశమనం లభిస్తుందని ఎస్పీ వివరించారు. ఇరుపక్షాల అంగీకారంతో వివాదాలు పరిష్కారం కావడం వల్ల పరస్పర శత్రుత్వం తగ్గి సత్సంబంధాలు కొనసాగుతాయన్నారు. లోక్ అదాలత్‌లో ఇరుపక్షాల అంగీకారంతో వెలువడే అవార్డు సివిల్ కోర్టు డిక్రీతో సమానమని, దానిపై అప్పీల్‌కు అవకాశం ఉండదని తెలిపారు.
సంప్రదించాల్సిన వివరాలు:
తమ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలనుకునే వారు సమీప పోలీస్ స్టేషన్‌ను, తమ న్యాయవాదులను లేదా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాలను సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలని ఎస్పీ సూచించారు.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం విశాఖపట్నంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న న్యాయ సేవా సదన్‌లో పనిచేస్తోంది. అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి, చోడవరం, మాడుగుల మండల న్యాయ సేవా సంఘాలను కూడా సంప్రదించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఫోన్: 0891-2560414, 0891-2575046
టోల్ ఫ్రీ: 15100
ఈ-మెయిల్: vskpdlsa@yahoo.com, dlsa.vsp@gmail.com

రాజీ మార్గమే రాజమార్గమనే స్ఫూర్తితో వివాదరహిత, ప్రశాంత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలని ఎస్పీ తుహిన్ సిన్హా విజ్ఞప్తి చేశారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: